ఇదీ కధ 1

By | November 21, 2019

వన్ – టు- గో….
అమ్మాయిలు ఆరుగురూ ముందుకు దూకారు, అబ్బాయిలు అరవై మంది యీలలు వేశారు. కేకలు వేశారు. కొందరు అమ్మాయిలు ఎగిరెగిరి గంతులు వేస్తూ చప్పట్లు కొట్టారు.
“కమాన్! మాధవీ! ఫినిషిట్!” ప్రేమ్ సాగర్ గొంతెత్తి అరుస్తున్నాడు. మాధవి మెడ ప్రక్కకు తిప్పి ప్రే మ్ సాగర్ వైపు చూసింది.
“కమాన్! హరి అప్ రా!” నలుగురు అబ్బాయిల గొంతులు ఒక్కసారిగా మోగాయి.
రాణి ముందుకు వచ్చింది, మాధవి వెనుకపడింది.
అటూ ఇటూ చూడకు పరుగెత్తు” ప్రేమ్ సాగర్ ట్రాక్ ప్రక్కనే పరుగు లంకించుకున్నాడు.
హైదరాబాదు మలక్ పేటలో గుర్రాలు పరుగెడుతున్నాయి. కాలేజి మైదానంలో అమ్మాయిలూ పరుగెడుతున్నారు. హంటర్స్ తమ ఫేవరేటు గుర్రాలను పిలుస్తున్నారు. అబ్బాయిలు తమ ఫేవరేటు అమ్మాయిలను పిలుస్తున్నారు.
“కమాన్ మాధవి” ప్రే మ్ సాగర్ గొంతు చించుకుని అరిచాడు.
వందమీటర్లు పరుగు పందెం ఆఖరి ఘట్టంలో పడింది. ప్రేమ సాగర్ ట్రాక్ ప్రక్కన పరుగెడుతూ అయాసపడిపోతున్నాడు. ఫినిషింగ్ పోస్టుకు ముందు నిలబడి పళ్ళు బిగించి పరుగెడుతున్న మాధవిని చూసి రెండు చేతులు ముందుకు చాచాడు.

మాధవి ప్రేమ్ సాగర్ చేతుల్లో వాలిపోయింది.

 2

కాలేజి దియేటరు  కిటకిటలాడి పోతుంది. ముందు వరుసలో పుర ప్రముఖులు, పేరంట్స్ కూర్చున్నారు. విద్యార్ధులు, విద్యార్ధినులు ఉత్సాహంగా తిరుగుతున్నారు. సగానికి పైగా బెల్ బోటమ్స్ – నాలుగో వంతు జీన్స్.
ప్రిన్సి పాల్ మైకు ముందుకు వచ్చాడు.
“ఈనాటి బహుమతి ప్రదానోత్సవానికి జిల్లా జడ్జి శ్రీ రామనాధం గారిని అధ్యక్షత వహించమనీ , జిల్లా సూపరింటెండెంట్ శ్రీ సాంబశివరావు గారిని కాలేజి అవిష్కరించమని, జిల్లా మెడికల్ ఆఫీసర్ శ్రీ వి.వి. యస్. మూర్తి గారిని బాహుమతి ప్రదానం చేయమని కోరుతున్నాను. దయ చేసి వారంతా స్టేజి మీదకు రావాలని ప్రార్ధిస్తున్నాను.
కరతాళ ధ్వనుల మధ్య ఒక్కొక్కరే స్టేజి మీద కొచ్చి కూర్చున్నారు.
ప్రార్ధన – అధ్యక్షుని తొలిపలుకులు సావనీర్ ఆవిష్కరణ జరిగిపోయింది. విద్యార్ధి, విద్యార్దినులలో ఆతృత పెరిగి పోతుంది.

“ఇక పోటీలలో గెల్చిన వారికీ బహుమతి ప్రదానం జరుగుతుంది” ప్రిన్సిపాల్ మాటలు హాలులో చెలరేగిన కేకలు ఈలల్లో మునిగిపోయాయి.
విద్యార్ధి యూనియన్ సెక్రటరీ పేర్లు చదువుతున్నాడు. డాక్టరు మూర్తి కప్పులు – పతకాలు – మెరిట్ సర్టిఫికెట్లు అందిస్తున్నాడు.
“షటిల్ సింగిల్స్ చంపియన్ మాధవి యం. ఎ . సెకండ్ ఇయర్”. ప్రేమ్ సాగర్ మాధవిని ముందుకు నెట్టాడు. హాలులో చప్పట్లూ, యీలలు మోగాయి. మాధవి చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. స్టేజి మీదకు వేగంగా నడిచింది.
“కంగ్రాచ్యులేషన్స్” డాక్టర్ మూర్తి మాధవి చేతికి కప్పు అందిస్తూ అన్నాడు. మాధవి డాక్టరు మూర్తికి నమస్కరించి కప్పు అందుకోడానికి ప్రయత్నించింది. చేతులు వణికాయి. “ఎలాగో కప్పు అందుకొన్నది. కప్పు అడుగు భాగం చేతిలో నుంచి జారి కింద పడింది’ అమ్మాయిలూ- అబ్బాయులూ గోలగా అరిచారు. చేతిలో వున్న కప్పు కూడా కిందకు జారింది. హాలులో అల్లరి పెరిగింది. కిందపడ్డ కప్పు అందుకొంటున్న మాధవికి సహాయం చేయడానికి డాక్టరు మూర్తి ముందుకు వంగాడు. దగ్గరగా వచ్చిన డాక్టరు ముఖాన్ని చూసి మాధవి , చేతిలో వున్న కప్పును మళ్ళీ వదిలేసింది! ఈసారి స్టేజి మీద వున్నవాళ్ళు కూడా బిగ్గరగా నవ్వారు. ద్వితీయ బహుమతి అందుకోవడానికి వచ్చిన రజని కింద వున్న కప్పును అందుకొని మాధవి చేతిలో పెట్టింది. తడబడే అడుగుల్తో మాధవి స్టేజి దిగింది.
అధ్యక్ష స్థానంలో కూర్చున్న మాధవి తండ్రి రామనాధం గారు చిరాకు పడి ముఖం చిన్న బుచ్చుకున్నారు.
“చీటాలా పరుగెత్తిన నీ ఫేవరేట్ కుందేలు పిల్ల అయిందేమిటిరా సాగర్” అంటూ శ్రీకాంత్ ప్రే మ్ సాగర్ వీపు మీద చరిచాడు.
“స్టేజి ఫియరు లేరా” అన్నాడు సారధి.
“కాదు స్టేజ్ ఫీవరు” అన్నది రాణి.
సాగర్ తన చుట్టూ వున్నవాళ్ళ నుంచి తప్పుకొని మాధవి దగ్గర కొచ్చాడు. స్టేజి ప్రక్కన అయోమయంగా చూస్తూ నిలబడ్డ మాధవిని చూసి “ఏమిటి! ఏమైంది మాధవీ” అని అడిగాడు.
“ఏం కాలేదు! ఏమిటో అలా అయింది.” నసిగింది మాధవి.
మరో పది నిమిషాల పాటు విజేతలకు బహుమతులు ఇవ్వడం కొనసాగింది.
“వంద మీటర్లు పరుగు – ప్రధమ బహుమతి – కుమారి మాధవీ – ” మైకులో వినబడగానే ఈలలు కరతాళధ్వనులతో హాలంతా నిండిపోయింది.
“మాధవీ! నిన్నే వెళ్ళు” ప్రేమ్ సాగర్ ఆమె చేతిలోని కప్పు అందుకొని తొందర పెట్టాడు. మాధవి ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుని ధైర్యాన్ని కూడతీసుకుని గబగబా స్టేజ్ ఎక్కింది. ఈసారి ఉత్సాహ పూరితంగా కరతాళధ్వనులు హాలులో వినపడ్డాయి. సభికుల కేసి ఓసారి చూసి, డాక్టరు మూర్తి కేసి తిరిగింది. డాక్టరు మూర్తి ప్రెషర్ కుక్కరు తీసి “పాపా , నీకు వంట వచ్చా” అన్నాడు. స్టేజి మీద వున్న వారంతా నవ్వారు. అధ్యక్షుడు రామనాధం గారు కూడా చిరునవ్వు విసిరారు కూతుర్ని చూస్తూ.
డాక్టరు మూర్తి ముందుగా వంగి మాధవికి ప్రెషర్ కుక్కర్ ను అందించారు. నవ్వుతూ వున్న మూర్తి కళ్ళల్లోకి చూసింది మాధవి.
సేప్టీ వాల్వు ఎగిరి ఇంటి కప్పుకు తగిలింది! జుయ్ మంటూ స్టీము లేచింది! “పాపా నీకు వంట వచ్చా” చెవులు గింగుర్లేత్తాయి.
నీటి ఆవిర్లు ముఖం మీద అలుముకున్నాయి. సెగల పోగల మధ్య డాక్టరు ముఖం మసక మసకగా కన్పించింది. స్టేజి మీద వాళ్ళూ కిందా, హాలులో ఉన్నవాళ్ళూ పైనా తిరుగుతున్నారు.
మాధవి చేతిలో నుంచి ప్రెషర్ కుక్కరు జారి పడింది! కిందకు వాలిపోతున్న మాధవిని పట్టుకోబోయిన డాక్టరు మూర్తి మైక్ కిందకు తోశాడు. జడ్జి రామనాధం గారు ఒక్క వూపున కుర్చీలో నుంచి లేచారు. ఆ కుదుపుకు టేబిలు మీదున్న ప్లవర్ వాజులూ, దండలూ కిందపడ్డాయి. సాగర్ ఆదుర్దాగా స్టేజి మీదకు పరుగెత్తాడు.
“మీరంతా దూరంగా నిలబడండి. గాలి రానివ్వండి” డాక్టర్ మూర్తి మాధవి చుట్టూ మూగిన వాళ్ళను చూసి హెచ్చరించాడు.”
“ఏమైంది డాక్టరు గారూ! మాధవి తండ్రి ఆదుర్దాగా అడిగాడు.
“నధింగ్ టు వర్రీ, ఫైంట్ అయింది అంతే.”
“డాక్టర్ గారూ?”
“ఫరవాలేదు డోంట్ వర్రీ, త్వరలోనే స్పృహ వస్తుంది. చల్లటి నీళ్ళు తీసుకు రండి.”
“దయ చేసి నిశ్శబ్దంగాకూర్చోండి. స్టేజి మీద కొచ్చిన వాళ్ళంతా దిగిపోవాలి” ప్రిన్సిపాల్ విద్యార్ధులను అర్ధించాడు.

    3

“నమస్తే”
“హలో సాగర్, కమాన్”
“మాధవి ఎలా వుంది”
“ఓ.కే. షి ఈజ్ అల్ రైట్. అలా కూర్చో” రామనాధం గారు కళ్ళజోడు తీసి తుడుచుకుంటూ సోఫాలో నుంచి లేచి నిలబడ్డారు.

“కుర్చోవోయ్ అని రామనాధం గారు మెట్ల పైకి చూసి “మాధవీ , మాధవీ ” అని పిలిచారు.
“వస్తుందిలే కూర్చో” అంటూ రామనాధం గారు పేపరు తీసుకుని తన ఆఫీసు గది కేసి బయలు దేరారు.
“సార్ మీ కోసమే వచ్చాను.” అన్నాడు సాగర్.
“నా కోసమా?” నోసలేగరేసి సాగర్ ను చూసి అన్నారు రామనాధం గారు.
“మీ కోసం కూడా!”
“ఓ ఐ సి ఏమిటి విశేషం?”
“రేపు మా నాన్నగారు పుట్టిన రోజు”
“పోలీసు వాళ్ళకు కూడా పుట్టిన రోజు లేమిటోయ్.”
“అదే మాట మా నాన్నగారు కూడా అన్నారు.”
“కరెక్టు చూశావా మరి!”
‘అయితే సార్ ఏ ‘లా’ లో వుందంటారూ!”
“ఆఫ్ కోర్స్ ‘లా’ పాయింటు లేదనుకో”
‘అందుకే సార్ మా నాన్నను బలవంతం మీద ఒప్పించాను. ఈ బర్త్ డే జరపడానికి ఇంకో విశేషం కూడా వుంది సార్.”
“అదేమిటోయ్?”
“మా నాన్నగారికి ఇరవై అయిదు సంవత్సరాలు పూర్తవుతుంది.”
ఓ! అయితే కంపల్సరీ రిటైర్ మెంటు చేయవచ్చన్న మాట!
‘అదేమిటి సార్! మా నాన్నగారి లాంటి హానెస్ట్ ఆఫీసర్ మన స్టేటులోనే లేరు. ప్రెసిడెంటు మెడల్ కూడా పొందారుగా.”
“యస్ యస్, ఐనో , తమాషా కంటున్నా.”
“హాయ్ ప్రేమ్ ” మాధవి జడ కొసలు వేలుకు చుట్టుకుంటూ వచ్చింది.
“వస్తానోయ్ సాగర్! నాకు కోర్టుకు టైం అయింది.” అంటూ రామనాధం లేచారు.
“ఎల్లుండి తప్పకుండా రావాలి మాయింటికి.”
“ఓ, ష్యూర్” అని రామనాధం వెళ్ళిపోయారు.
“ఏమిటి విశేషం” మాధవి సాగర్ కు ఎదురుగా కూర్చుంటూ అన్నది.
“ఎల్లుండి మా నాన్నగారి పుట్టిన రోజు . మీ నాన్నగారిని స్వయంగా ఆహ్వానించటానికి వచ్చాను.”
“ఓహో! అందు కొచ్చావన్నమాట!” సాగదీస్తూ అన్నది మాధవి.
“మరెందు కొచ్చా ననుకున్నావ్!” కొంటెగా అన్నాడు సాగర్.
“నేనేమీ అనుకోలేదు” మూతి విరుస్తూ అన్నది మాధవి.
“అరె, అంతలోనే మెలికలు తిరిగి పోతావెందుకు?”
“మెలికలు తిరిగి పోవడానికి నేనేమన్నా పామునా?”
“కాదు, నగకన్యవు ” మాధవి కళ్ళలోకి చూస్తూ అన్నాడు.
“అదేమీ వర్ణ’నయ్యా బాబూ ! దేవకన్యా! వనకన్యా! జలకన్యా! అంటారు గాని నాగకన్యలా వున్నావని ఎవరన్నా అంటారా?”
“నాకు తెలుగులో ప్రవేశం తక్కువలే.”
“అందుకేగా మా రచయిత్రుల నవలలు చదవమనేది.”
“అయితే నీ అభిమాన రచయిత్రి ఎవరో చెప్పు!”
“ఏమిటీ కొంపతీసి ఆమె దగ్గర కెళ్ళి ప్రేమ పాఠాలు నేర్చుకుంటావా ఏమిటి?”
నీ సంగతి నీ అభిమాన రచయిత్రికే తెలిస్తే నిన్ను హీరోయిన్ గా పెట్టి ఓ కధ రాసెస్తుంది.”
“నిన్ను హీరో గా మాత్రం పెట్టదులే!”
“వద్దు బాబోయ్! నేను కనబడ్డ అమ్మాయినల్లా ప్రేమించలేను. విమానాలు, రాకేట్టులు నడపలేను. ఇంకా ఇంకా మీ హీరో గారు చాలా పనులు చేయాలి – అవన్నీ చేత కాదు.”
“ఇంతకీ నా సంగతి తెలిస్తే అన్నావ్, ఏమిటదీ?”
“అదే, ఆరోజు ప్రైజ్ తీసుకుంటూ , నువ్వు చేసిన గొడవ.”
“ప్రేమ్ ప్లీజ్ ఆ దృశ్యాన్ని మళ్ళీ గుర్తు చేయకు. నా కెందుకో అలా అయిపొయింది.”
“రేస్ లో చాలా అలసిపోయి వుంటావు. ఫిజికల్ గా ఎగ్జటాయి వుంటావు.”
“కాదు, ప్రేమ్ , మానసికంగానే ఏదో అయిపొయింది.”
‘అయితే అది స్టేజ్ ఫియర్.”
“కాదు ఎన్నో సార్లు స్టేజ్ మీద పాడాను, మాట్లాడాను. కాని ఆరోజు నా కెందుకో అలా అయింది. సైకాలజీ పి.హెచ్.డి చేస్తున్నావు. నీవే చెప్పాలి నా కుందుకలా అయిపోయిందో.”
“అయితే నేనడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పు.”
“ఓ.కే. ” సోఫాలో సర్దుకు కూర్చోంది.
“ఆరోజు రెండు సార్లు స్టేజ్ ఎక్కావు. రెండవసారి స్పృహ తప్పి పడిపోయావు , అవునా.”
“ఇదేం ప్రశ్న ,  బోడి ప్రశ్న.”
‘అందుకే ముందే సూటిగా సమాధానం చెప్పాలని చెప్పాను. నేనడిగిన ప్రశ్నలకు ‘అవును’ ‘కాదు’ అని మాత్రమే సమాధానం చెప్పాలి. ఎదురు ప్రశ్నలు వేయకూడదు.”
“సరే మళ్ళీ అడుగు”
“రెండు సార్లు స్టేజీ ఎక్కావు. రెండోసారి స్పృహ తప్పి పడిపోయావు , అవునా?”
“అవును, అవునూ! ఈ ప్రశ్న ఎందుకు అడిగినట్లూ?” సాగదీసి అడిగింది మాధవి.
“మళ్ళీ మొదలు – ఎందుకడిగా నంటావా? ఆరోజు జరిగింది నీ కేంతవరకు గుర్తుందో తెలుసుకోవడానికి తెలిసిందా!”
“తెలిసింది, తెలిసింది!” కొంటెగా నవ్వింది మాధవి.
“నువ్వు సీరియస్ గా వుంటేనే! లేకపోతే నే వెళ్ళిపోతా. నాకేం పని లేదనుకున్నావా?”
“అరే! అంతలోనే అలుగుతావేమిటోయ్!” సాగర్ చెయ్యి పట్టుకుని కూర్చో పెట్టింది మాధవి.
“దెన్ బి సీరియస్, అన్సర్ మై కొశ్చన్స్.”
“ఓ.కే.”
“మొదటిసారి స్టేజి ఎక్కి బహుమతి అందుకొని దిగేంతవరకూ నువ్వు మాములుగా వున్నావ్, అవునా!”
అంతవరకు గడ్డం క్రింద చెయ్యి పెట్టుకుని సాగర్ కేసి చిలిపిగా చూస్తున్న మాధవి ఆలోచనలో పడింది.
“కాదు, మొదటిసారి స్టేజి ఎక్కినప్పుడే ఏదో ఏదోగా అయిపొయింది.”
“ఓ ఐసి!”
“అవును, అప్పుడే ఏదో ప్రారంభమయింది.”

అప్పుడే అంటే సరిగ్గా ఎప్పుడో చెప్పగలవా?”
“ఊహు, సరిగ్గా చెప్పలేను.”
“సరే నా ప్రశ్నలకు త్వరత్వరగా సమాధానాలు చెప్పటానికి ప్రయత్నం చెయ్.”
మాధవి తల వూపింది. అంతవరకూ ఇదంతా ఏదో తమాషాగా, ఆటగా తీసుకున్న మాధవి సీరియస్ గా కూర్చున్నది.
“మైక్ లో నీ పేరు పిల్చినప్పుడు-”
“మాములుగానే ఉన్నాను. కొద్దిగా ఎక్సేయిట్ మెంట్! అది మాములుగా అందరికీ ఉండేదే.”
“నువ్వు నాకేమి వివరించవద్దు! నీకేదో అయి పోయిందన్నావే , అది ఎప్పుడు ఎక్కడ ప్రారంభమయిందో తెలియాలి.”
“ఓ. కే స్టార్ట్”
“మైక్ లో పేరు వినిపించినప్పుడా?”
“కాదు”
“స్టేజి మెట్లెక్కినప్పుడా?”
“కాదు”
“స్టేజి మీద నడిచినప్పుడా?”
“కాదు”
“ప్రైజ్ అందుకొంటున్నప్పుడా?”
“అవును”
“ప్రైజ్ ను చూశా?”
“కాదు”
“ప్రైజ్ అందిస్తున్న చేతిని చూసా!”
మాధవి ఎటో చూస్తుంది.
“ప్రైజ్ అందిస్తున్న చేతిని చూసా? కమాన్ అన్సర్ మై క్వశ్చన్ , కమాన్”
“ఓ ప్రేమ్ ” అప్రయత్నంగా అరచింది.
“కమాన్ చెప్పు. ఊ, కం అవుట్”
“అవును, అవును”
“ఆ చేతులు లేలా వున్నాయి.”
“ఎక్కడో ఎక్కడో చూసినట్లుగా.”
“ఆ చేతుల్లో ఏమన్నా ప్రత్యేకత ఉందా?”
“చేతుల్లో లేదు …..ఉంది!”
“చేతులో లేదు కాని ఉంది. ఎక్కడ ఉంది?”
“ఎక్కడో ? ఎక్కడో? మాధవి చూపులు చెదిరి పోతున్నాయి.
“చేతి వేళ్ళల్లో”
“ఏముంది? ఆ వేళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?”
“ఊ కమాన్! వెళ్ళు వంకరగా వున్నాయా? బాగా లావుగా వున్నాయా?”
“కాదు, తెగిపోయింది. ఒక వేలు తెగిపోయి ఉంది.”
“ఏ వేలు”
`”ఆరో వేలు”
“మాధవీ ” అంటూ సాగర్ లేచి , వణికిపోతున్న మాధవిని పట్టుకున్నాడు. “మాధవీ! మాధవీ!’ అని బిగ్గరగా అరుస్తూ స్తంభించిపోయిన మాధవిని కుదిపాడు.
మళ్ళీ ఏమయింది నాయనా’ గాభరాగా పరుగెత్తుకొచ్చింది మాధవి తల్లి నాగరత్నమ్మ.
ఆమె కేక విని కారేక్కబోతున్న రామనాధంగారు కంగారుగా లోపల కొచ్చారు.
మాధవి కొద్ది క్షణాలలో మాములు మనిషి అయింది.
“ఎందుకర్రా నా చుట్టూ మూగారు ఏమయింది?” అన్నది అందర్నీ కలయ చూసి.
“ఏమయింది సాగర్?” టై వదులు చేసుకుంటూ అడిగాడు రామనాధం గారు.
“ఏమి లేదు సార్, వాళ్ళమ్మ గారూ కంగారుగా పరుగెత్తు కొచ్చేసరికి మీ అమ్మాయిగారూ గాభరా పడ్డారు.”
“నేను కంగారు పడటమేమిటి నాయనా? నువ్వు మాధవీ ! మాధవీ! అని బిగ్గరగా కేకలు పెట్టావు కదా?” అడిగింది మాధవి తల్లి.
‘అబ్బే , అదా! అదీ మీ అమ్మాయి కాఫీ తెస్తానని లోపలికి వెళుతుంటే ఇప్పుడోద్దని కేక వేశానండీ.”
“మీ విడ్డురం బంగారం గానూ, అందుకు కేకలు వేయాలటయ్యా?”
“మీ అమ్మాయి, మీకా శ్రమ ఇవ్వటం ఇష్టం లేక కొంచెం గట్టిగా కేక వేశాననుకుంటాను.”
“నీ చోద్యం బంగారం కానూ! కాఫీ కలపటం కూడా నాకో శ్రమంటావా! ముప్పయ్యేళ్ళుగా గొడ్డు చాకిరీ చేయించుకున్న ఆ జడ్జి గారూ ఒక్క సారి అయినా నీ కెందుకు యీ శ్రమ అన్న పాపాన పోయారా! చిన్నవాడివి వైతే మాత్రమే నాయనా! పెద్ద వాళ్ళ కష్ట సుఖాలు తెలిసినవాడివి. నీ బుద్ది బంగారం నాయనా”
“ఇదిగో బంగారం! మీ నాయన నీకు బంగారం అని పేరు పెట్టాల్సింది. నాగరత్నం అని పేరు పెట్టాడు. ఇనపెట్టేలో బంగారం, వంటిమీద బంగారం , ఆది చాలదన్నట్లు మాట మాటకూ బంగారం తగిలించి మాట్లాడతా వెందుకు నాగరత్నం.”
“ఏ బంగారమయినా మా పుట్టింటి దగ్గర్నుంచి తెచ్చుకున్నదేగా! పదిహేనేళ్ళు ప్లీడరు పని, పదేళ్ళ నుంచి జడ్జి పదవి-”
“చిన్న మెత్తు సంపాదించ లేదంటారు అంతేగా?” సాగర్ మధ్యలో అందుకొని అన్నాడు.
ఏమయినా అసలు విషయం పక్కదారి పట్టినందుకు లోలోన ఆనందపడ్డాడు సాగర్. మాధవి, తల్లిదండ్రుల సంభాషణ సరదాగా వింటున్నది.
“బంగారం లాంటి మాటన్నావు నాయనా!” ఆప్యాయంగా సాగర్ ను చూసి అంది నాగరత్నమ్మ.
“ప్లీడర్ గా బంగారం సంపాయించ గలిగితే జడ్జి నే అయేవాడ్ని కాదు కాదోయ్ సాగర్.” అన్నారు రామనాధం గారు.
“డాడీ, ప్రస్తుతానికి యీ కేసు విచారణ వాయిదా వేసి కోర్టుకు బయల్దేరండి , ప్లీజ్!”
“వెల్ సేడ్ మైకిడ్!” అని రామనాధం గారు టై బిగించుకుంటూ కారెక్కి కోర్టుకు వెళ్ళిపోయారు.
“ఇదీ వరస! చూశావుగా నాయనా?” నాగరత్నమ్మ మురిపెంగా నవ్వుకోన్నది.
‘అచ్చంగా సినిమా డైలాగ్ ఇది, మమ్మీ! మమ్మీ నువ్వు సినిమాకు డైలాగ్స్ రాయకూడదూ!” తల్లి భుజం పట్టుకొని అల్లరి చేసింది మాధవి.
“ఉన్నారుగా! ఆయన్ను రాయమను”
“అబ్బ, ఇదీ అసలు సినిమా డైలాగు.”
“ఈ మహత్తర సన్నివేశంలో మీ అభిమాన రచయిత్రయితే ఏ డైలాగు రాస్తుందో చెప్పగలరా మాధవి గారూ!”
“ఏమిటా జానపద హిరోలా ముఖమూ, నువ్వునూ!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *