మనసున మనసై 1

By | November 21, 2019

మనసున మనసై 1   జయంతి ఆఫీసుకి తయారై డైనింగ్ టేబిల్ మీద లంచ్ బాక్స్ బ్యాగులో పెట్టుకుంటుంటే “ఇవాళ నాలుగ్గంటలకల్లా ఇంటికి రా” అంది కాస్త భయపడుతూనే పద్మావతి, జయంతి చటుక్కున తల్లివంక చూసి “ఎందుకు? మళ్ళీ ఏ తల మాసినవాడొస్తున్నాడట పెళ్ళి చూపులకి” వ్యంగ్యంగా ఎత్తిపొడుస్తూ అంది.
“ఏ తల మాసినవాడో, మా తాహతుకి తగిన వాడినే చూశాం. తలమాసినవాడట, నీలాగే బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నవాడే. నీ కంటికి ఆనడంలేదా” పద్మావతి కాస్త కటువుగా అంది.
“ఎవరు! మొన్న ఫోటో చూపించారు వాడా, నాకు నచ్చలేదని చెప్పాగా. మళ్ళీ చూపులెందుకు వద్దన్నాక” చిరాగ్గా చూసింది.
“మీ నాన్నగారేం జవాబు రాయకుండా ఊరుకున్నా, మా అబ్బాయి హైదరాబాదు హెడ్డాఫీసులో పనిమీద వస్తున్నాడు, పిల్లని చూస్తాడు అని వాళ్ళు రాస్తే  ఏం చెయ్యమంటావు- యింటికి రావద్దని ఎలా అంటాం” పద్మావతి కోపంగా అంది.
“యింటికి వస్తానని ఫోను చేసినపుడు చెప్పాల్సింది” రెట్టించింది జయంతి.
“ఏమో తల్లీ! నీ అంత అమర్యాదగా మొహం మీద చెప్పడం రాదు. వచ్చి చూశాక, నీకలవాటేగా నచ్చలేదని అపుడు చెప్పేయి”
“అయినా జయా ఫోటోచూసి నచ్చలేదంటే ఎలాగే. కొంతమంది ఫోటోలో సరిగాపడరు పైకి బాగున్నా-చూస్తే ఏం పోయింది” పురిటికొచ్చిన వాసంతి చెల్లెలికి నచ్చచెప్పే ధోరణిలో అంది.
“అందం సరే, మొన్న మొన్నటి వరకు క్లరికల్ పోస్ట్ లో ఉండి, కిందటేడేగా ఆఫీసరు రేంకుకొచ్చాడు, ఉత్తి బి.కాం.నా కంటే తక్కువ చదివిన వాడిని, నేనెందుకు చేసుకోవాలి, ఇలాంటి సంబంధాలు చూడద్దని ఎన్నిసార్లు చెప్పాలి” గయ్ మంది జయంతి.
“చూడమ్మా మహారాణీ, మీ తాహతుకి సరిపోయిన సంబంధాలే చూడగలం, మనం ఆశపడితే మాత్రం మనకంటే అంతస్థువాళ్ళు మనల్ని ఎందుకు ఇష్టపడతారు. వాళ్ళ హోదాకి సరిపోయిన వాళ్ళని వాళ్ళు యిష్టపడతారు, ఇంతకీ పోనీ ఏరంభో, ఊర్వశి లాంటి అందగత్తెనో అయితే కాస్త దిగి వచ్చి ఒప్పుకుంటారు. ఇది వరకు ఎన్ని సంబంధాలు చూడలేదు, తిరిగి పోలేదు, యిన్నిసార్లు అయినా నీకింకా బుద్ది, జ్ఞానం రాలేదు. ఇలా వచ్చిన సంబంధం అల్లా తిరగొట్టి, యింకో ఏడాది రెండేళ్ళు పోతే యీ మాత్రం సంబంధాలు దొరకవు, వయసు మించిపోతే -“చాలా కోపంగా అంది పద్మావతి, “ఏ సంబంధం చూసినా ఏదో వంకే” తిరస్కారంగా అంది.
“ఆ చూశారు, మెల్లకన్నువాడిని, బట్టతల వాడిని, బానపొట్టవాడిని, పొట్టివాడిని, నల్లవాళ్ళని – ఒక్కళ్ళకీ ఓ రూపురేఖ లేదు – కాస్త ఓ మాదిరిగా వున్నాడనుకుంటే చెత్త ఉద్యోగాలు లేకపోతే యిద్దరు చెల్లెళ్ళు తమ్ముళ్ళు, బాధ్యతలు నెత్తిన వున్నవాళ్ళు….ఎకసెక్కంగా అంది జయంతి.
“అవునమ్మా, నీవు పెళ్ళాడతావని తల్లీ, తోడబుట్టిన వాళ్ళులేని వాళ్ళు వస్తారు, వున్నా వదిలేసుకుంటారు నీకోసం. మాట మాట్లాడితే సబబుగా వుండాలి”
“ఇదిగో అమ్మా! ఎన్నిసార్లు చెప్పాను, యిలాంటి సంబంధాలు తేవద్దని, మంచి సంబంధాలు తేలేకపోతే నాకర్మానికి నన్ను వదిలేయండి, అంతేకాని నేను చచ్చినా నాకిష్టంలేని సంబంధం చేసుకోను” జయంతి తెగేసినట్లంది.
“జయా! ఏమిటే నీ మొండితనం ఏ సంబంధం తెచ్చినా ఏదో ఒక వంకపెడితే ఎక్కడ నించి వస్తాయే” వాసంతి చెల్లెకి నచ్చ చెప్పే ధోరణిలో అంది.
“ఈ నీతులకేంలే- ఇతర్లకి చక్కగా చెప్పవచ్చు, నేనేం అడిగాను, తాతా, బిర్లా, అంబానీ ఫేమిలీలడిగానా, జమీందార్లడిగానా, కాస్త పొడుగ్గా, స్మార్ట్ గా వుండాలన్నాను. చదువు, ఉద్యోగం బాగుండాలని కోరుకోకూడదా, నేనే ఏడెనిమిదివేలు తెచ్చుకుంటుంటే, నాకంటే ఎక్కువ సంపాదించే వాడొద్దా….’ ఉక్రోషంగా అంది.
“ఏం యీ కుర్రాడు ఆఫీసరు, నీకంటే వెయ్యో పదిహేను వందలో జీతం ఎక్కువే బ్యాంకు ఉద్యోగం- అందం అంటే అసలు మన తెలుగు మగాళ్ళలో అందంగా ఎంత మందుంటారే. కాస్త నార్త్ లో పంజాబీలు, సింధీల లాంటి వాళ్ళు రంగు వుండి బాగుంటారు. మన తెలుగు వాళ్ళలో ఆడవాళ్ళే రంగుండరు, ఇంకా మగవాళ్ళకి రంగెవరు చూస్తారు, అసలింతకీ అబ్బాయి చదువూ, సంస్కారం ఉద్యోగం చూడాలి కాని అందం ఎవరూ చూడరు. ఏదో మరీ కోతిలా వుంటే పోనీ అనుకోవచ్చు, కట్టుకునే వాడి అందం కాదే కావాల్సింది, మంచితనం, భార్యబిడ్డల్ని సుఖపెట్టగలిగే వాడు కావాలని కోరుకో, యిద్దరిది ఒక మాట, బాట కావాలని ఆడది కోరుకోవాలి గాని ఈ గొంతెమ్మ కోరికలేమిటి పద్మావతి ప్రతీసారిలాగే ఈ సారీ కూతురికీ నచ్చచెప్పపోయింది. జయంతి విసురుగా తలతిప్పి తల్లి వంక తీక్షణంగా చూసి ‘నాకు నచ్చనిది సర్దుకుని బతకాల్సినంత అవసరం నాకు లేదు’

“సర్లే పోనీ, చేసుకోవడం మానడం తరువాత, అబ్బాయి వస్తానన్నాడు, తీరా వచ్చాక పిల్లను చూపించం అంటే పరువు పోతుంది నీకోసం కాకపోయినా మీనాన్న మర్యాద కాపాడడానికైనా వచ్చి కూర్చో కాసేపు” విరక్తిగా అంది కూతురు వినదని తెలిసి. వాసంతీ ఏదో అనే లోపలే జయంతి విసురుగా బయటికి వెళ్ళిపోయింది. పద్మావతి నిట్టూర్చింది. ‘ఆఖరికి దీనిరాత ఎలా తగులడ్తుందో, దీని కంత పొగరేమిటో, ఏం చూసుకునో దానికింత..మిడిసిపాటు’ ఉక్రోషంగా అంది పద్మావతి.
“సర్లే అమ్మా దానికింకా కళ్యాణ ఘడియ వచ్చినట్టులేదు. ఆటైము వస్తే అన్నీ నచ్చుతాయి. అందరూ అందంగా కనపడతారు. మనం దానికేం చెప్పిలాభం లేదు…..’ పెద్దకూతురు తల్లిని శాంతపరుస్తూ అనునయించింది.
“ఆ ఉద్యోగం చూసుకుని మిడిసిపడిపోతుంది. తనేదో అప్సరసననుకుంటుంది. ఇంకొకరికి వంక పెట్టేముందు తన అందం ఏ పాటిదో చూసుకోవాలి. ఇదేం పచ్చగా బంగారం బొమ్మలా ఉందా, ఏదో కాస్త ఛాయ తక్కువైనా కనుముక్కు తీరు ఫరవాలేదు, ఎమ్మేవరకు చదివింది, బ్యాంకు ఉద్యోగం ఈపాటి దానికే ఇలా తైతెక్కలాడిపోతుంది. మా తల్లి యింకా అందంగా వుంటే ఏమయ్యేదో, దీని వరస చూస్తే దానికి పెళ్ళయ్యే రాతున్నట్టు లేదు’ అంది నిట్టూర్చి లోపలికెళ్ళింది.
సాయంత్రం కావాలనే జయంతి అరగంట ఆలస్యం చేసి మరీ వచ్చింది అయినా డ్రాయింగు రూమ్ లో పెళ్ళికొడుకు కూర్చుని కనిపించాడు. తల్లి తండ్రి కూర్చుని మాట్లాడుతున్నారు. ‘అదిగో అమ్మాయొచ్చింది-‘ అంటూ తల్లి లేచింది. జయంతి ఒక్కక్షణం ఏం చెయ్యాలో తోచని దానిలా నిలబడి పోయింది. ఈలోగా అతను లేచి నిలబడి నమస్కారం చేశాడు. జయంతి అప్రయత్నంగానే తనూ నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే తండ్రి లేచి గదిలోకి వెళ్ళాడు. లోపల గదిలోకి వెళ్ళాక ఏదో కోపంగా అనబోతున్న జయంతిని వారిస్తూ, ఆజ్ఞాపిస్తున్నట్టుగా ‘ఇప్పుడేం మాట్లాడొద్దు, వెంటనే ఐదునిమిషాల్లో కాస్త తయారై బయటికి రావాలి” అని మరోమాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు వెంకటేశ్వరరావు. ఇంక తప్పదన్నట్టు జుత్తు దువ్వుకుని కాస్త పౌడరద్దుకుని ముఖం గంభీరంగా పెట్టుకుని వచ్చి సోఫాలో కూర్చుంది. ‘మా అమ్మాయి జయంతి, ఆంధ్రాబ్యాంకులోనే పని’ తండ్రి అన్నాడు.
“ఏం బ్రాంచండి” అన్నాడు గోపాలకృష్ణ మాట కలపడానికన్నట్టు.
“హైదర్ గూడా” అంటూ ముభావంగా అని కళ్ళెత్తి చూసింది. అనుకున్నట్లే నలుపు, పెదాలు కూడా నలుపు, నెత్తి మధ్య నాలుగు వెంట్రుకలు రాలిపోతాం అని బెదిరిస్తున్నట్టు మూడొంతుల బట్టతల, ఐదడుగుల ఐదంగుళాలు పొడుగు, కళ్ళజోడు, అతని ఆకారం చూసి తల తిప్పేసుకుంది. ఇంకో పావుగంట ముళ్ళమీద కూర్చున్నట్టు కూర్చుని అడిగిన వాటికి నిరాసక్తంగా జవాబిచ్చింది. ‘వస్తానండీ, మావాళ్ళతో మాట్లాడి, ఉత్తరం రాయిస్తా’ అని లేచాడు గోపాలకృష్ణ. బతుకుజీవుడా అనుకుంది జయంతి. అతనలా గేటు దాటగానే తల్లిమీద ఎగిరిపడింది. ‘ఇదిగో యింకోసారి ఇలాంటి వాళ్ళని పిలిచి కూర్చోమంటే చచ్చినా కూర్చోను.”
“ఏం…. అతనికేం లోటొచ్చింది, కాస్త రంగు తక్కువంతే…. ఫామిలీ, చదువు, ఉద్యోగం అన్నీ మంచివే… బరువు బాధ్యతలు లేవు. ఏం మనందరం పచ్చగా వున్నామా’ లోపలికివస్తూ తండ్ర్రి అన్నాడు.
“ఆ… పచ్చగా లేకపోయినా ఇలా తారుడబ్బాలా లేం, అబ్బబ్బ ఆ పెదాలు గోపాలకృష్ణుడే…. పైన బట్టతల ఈ అవతారానికి, ఇంకా ఏం లోటొచ్చిందని అడుగుతున్నారు’ హేళనగా అంది జయంతి. తండ్రి ఏదో అనబోయే లోపలే ‘ఎక్స్ క్యూజ్ మీ…’ అని వినబడి అంతా గుమ్మం వైపు చూసి తెల్లపోయారు. గోపాలకృష్ణ అక్కడ నిలబడి వున్నాడు-
జయంతి మాటలు అతను విన్నాడన్నది అతని ముఖం చూడగానే తెల్సింది అందరికీ. జయంతి గిల్టీగా చూసి లోపలికెళ్ళిపోయింది. వెంకటేశ్వరరావుగారు మొహాన నవ్వు పులుముకుని …. “ఆ….ఆ.. రండి…. ఏమిటి ఏదన్నా మర్చిపోయారా…” అంటూ ఎదురెళ్ళాడు.
“జాతకచక్రం అడిగి తీసుకోమన్నారు మానాన్నగారు. మర్చిపోయానని అడగటానికి వచ్చాను.. యిప్పుడింక అవసరం లేదని తెల్సింది లెండి” అదోరకంగా నవ్వి వెనుదిరిగాడు. వెంకటేశ్వరరావు ఏదో అనబోయేంతలోనే అతను గేటు దాటాడు. వెంకటేశ్వరరావు ఆవేశంగా లోపలికొచ్చాడు.
“దీనికింక ఈ జన్మకి పెళ్ళికాదు. దీనికిదే ఆఖరి సంబంధం నేను చూడటం, పెళ్ళి చేసుకుంటుందో మానుకుంటుందో అదే ఎవడినన్నా చూసుకుంటుందో దానిష్టం. మరింక నాదగ్గిర దాని పెళ్ళి ఊసెత్తద్దు, తెల్సిందా!” భార్యమీద గట్టిగా ఎగిరిపడ్డాడాయన.
“బాగానే వుంది, దానికది, మీకు మీరు యిద్దరూ మధ్య నన్ను చంపకండి, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి, నాకూ ప్రాణం విసిగిపోయింది, దీనికి పెళ్ళయ్యే గీత వున్నట్టు లేదు, అందుకే దానికే పెడబుద్దులు, కానీండి ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు…..” పద్మావతి చాలా చిరాగ్గా అని లోపలికి వెళ్ళిపోయింది.
ఇంట్లో కాసేపు శ్మశాన నిశ్శబ్దం. గదిలో జయంతి కాస్త గిల్టీగా ఫీలవుతూ కూర్చుంది. అందరికీ కోపం, విరక్తి వచ్చాయన్నది ఆమెకి అర్ధమైనా, అతను విన్నాడన్న భావానికి తప్ప, తనేదో అతన్ని నిరాకరించి తప్పు చేసిన భావం ఆమెకి కలగలేదు. నచ్చనివాడిని ఎలా చేసుకోవడం. అమ్మ, నాన్న కోసం సర్దుకుపోవాలా, చేసుకొని నచ్చనివాడితో రోజూ కొట్టుకు చావాలా, ఆమె తనని తను సమర్ధించుకుంటూ అనుకుంది.

డ్రాయింగు రూములో కూర్చున్న వాసంతి, దమయంతి, సుమంత్ చిన్నగా మాట్లాడుకుంటున్నారు. సుమంత్ ‘చిన్నక్క ఏమిటి ఇలా అందరికీ వంకలు పెడుతుంది తను మహా అందంగా వున్నట్టు’ అన్నాడు కాస్త తిరస్కారంగా. అందరిలోకి చిన్నవాడు ఇంజనీరింగు రెండో ఏడు చదువుతున్నాడు. దమయంతి మూడో ఆడపిల్ల బి.ఏ.బి.ఇడి చేసి ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో కొత్తగా ఉద్యోగంలో చేరింది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో కొడుకుకోసం నాలుగోసారి ప్రయత్నించి నెగ్గారు వెంకటేశ్వరరావుగారు. ఆయనకి పెద్దకూతురు వాసంతితో ఏగొడవా లేకపోయింది. బుద్దిగా డిగ్రీ పూర్తిచేసి తల్లీతండ్రి చూసిన సంబంధం చేసుకొంది. పెళ్ళయ్యాక భర్త ఇష్టంతో ఓ చిన్న కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం చేస్తుంది. నలుగురు పిల్లలతో బ్యాంక్ ఉద్యోగి వెంకటేశ్వరరావు సామాన్య మధ్యతరగతి సంసారి. బ్యాంకులోనుతో ఓ అపార్ట్ మెంట్ కొనుక్కొన్నారు. రిటైరవ్వడానికింకా నాలుగేళ్ళు వుంది. ఈలోగా ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోవాలని ఆయన తాపత్రయం. వాసంతి పెళ్ళయి నాలుగేళ్ళయింది. ఆ పెళ్ళి ఖర్చునుంచి ఓ ఏడాది తేరుకున్నాక రెండో కూతురికి సంబంధాల వేట మొదలుపెట్టారు. ఈమూడేళ్ళలొ కనీసం ఓ పదిపన్నెండు సంబంధాలు చూశారు జయంతికి. ప్రతిదానికి ఏదో వంక పెట్టి తిరస్కరించింది. నలుపని, పొట్టని, ఉద్యోగం నచ్చలేదని, ఫ్యామిలీ నచ్చలేదని కొన్ని సంబంధాలు కాస్త బాగున్నవి వాళ్ళే నచ్చలేదని తిరస్కరించారు. వాళ్ళు జయంతికి నచ్చి, వాళ్ళు నచ్చలేదని రాసినపుడు మొహం మాడ్చుకుని “ఏడిశాడు వెధవ” అంటూ ఎగిరేది. ఎన్ని సంబంధాలు తెచ్చినా నచ్చలేదంటూంటే ఓసారి తల్లి గట్టిగా దెబ్బలాడింది. ‘అసలు ఏమిటి నీ ఉద్దేశం మీనాన్న అడగమన్నారు. ప్రతివాడికి ఏదో వంకలు పెడ్తున్నావు. మన తాహతు ఎగిరే మాట్లాడుతున్నావా, ఇంత కంటే గొప్ప సంబంధాలు వెతికే శక్తి మాకు లేదు’ నిష్కర్షగా అందావిడ.
‘మహా చాలా గొప్ప సంబంధాలు’ వెకసక్కంగా అంది జయంతి, ‘ఒకటుంటే ఒకటి లేదు చాలా మంచి సంబంధాలుట’ వెటకారంగా అంది.
“అంటే…. తమరికి ఏ సినీ హీరోలాగానీ, నవలా హీరోలా ఆరడుగుల ఆజానుబాహుడు, అందగాడు, లక్షాధికారి, ఐదంకెల జీతగాడు….. కార్లు, మేడలు అవి తేవాలా, అమ్మా తల్లీ కోరికలు అందరికీ వుంటాయి. కావాలనుకునే ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి. లక్షలు, మేడలు, అందం, పెద్ద ఉద్యోగం అన్నీ వున్నవాడు నీలాంటి దాన్నెందుకు చేసుకుంటాడు. అవన్నీ వున్న అందమైన గొప్పింటి దాన్ని చేసుకుంటాడు” పద్మావతి హేళనగా అంది. జయంతి చురచుర తల్లి వంక చూసింది. ‘లక్షాధికార్లు, మేడలు కారు కావాలని నీకు చెప్పానా’ గయ్ మంది.
‘మరేం కావాలిట నీకు. అదేదో సరిగా చెప్పి ఏడు’ విసుగ్గా అంది పద్మావతి.
‘ఉద్యోగం కనీసం ఆఫీసరవాలి, పొడుగ్గా స్మార్ట్ గా రంగుండాలి. సెన్సాఫ్ హ్యూమరుండాలి’
“తమరెంత పొడుగున్నారమ్మా, ఐదు రెండు, రంగు ఛామనఛాయ, నీకున్నట్టే ఆ వచ్చినవాడికీ రంగు, పొడుగున్న అమ్మాయి కావాలనుకోడు. సెన్సాఫ్ హ్యూమరా… పెళ్ళిచూపుల్లో తెల్సిపోతాయా, మగాడిలో చూసుకోవాల్సింది చదువు, ఉద్యోగం, కుటుంబంమంచి చెడ్డలు, ఆ తర్వాత నీ అదృష్టం బాగుంటే మంచివాడు, సంస్కారవంతుడు నీవన్న సెన్సాఫ్ హ్యూమర్ వున్నవాడు అవచ్చు. అంతేగాని ముందే గొంతెమ్మ కోరికలు కోరితే ఈ జన్మకి పెళ్ళికాదు….ఆలోచించుకో” చెప్పాల్సింది చెప్పి ఆవిడ లోపలికెళ్ళింది.
జయంతి ఉక్రోషంగా తను ఏమడిగిందని వీళ్ళు ఇన్ని నీతులు చెప్తారు. కాస్త స్మార్ట్ గా మంచి ఉద్యోగంలొ వుండాలని కోరుకోకూడదా! అనుకుంటూ గింజుకుంది.
జయంతి ముందునుంచి దేన్లోనూ సర్దుకునే మనస్తత్వం కాదు. తనన్నది కావాలి. దొరకాలి అనే పంతం, అది దొరికే వరకు పట్టుదల. చిన్నప్పుడు వాసంతివి పొట్టయిన బట్టలు తొడిగితే విప్పి పారేసేది. వాసంతి క్లాసు పుస్తకాలు పాతవి వాడమంటే వప్పుకునేది కాదు. తనకి వేరే పక్క కావాలి తప్ప అక్క చెల్లెలు దగ్గిర పడుకునేది కాదు. తన పుస్తకాలు ఎవరన్నా ముట్టుకున్నా, పెన్ను, పెన్సిలు లాంటివి వాడినా తిట్టేది. ఏ మాటయినా అనడానికి వెరుపు లేదు. పెద్దా చిన్నా అన్న తేడా లేకుండా తనకిష్టం లేనిది మొహంమీద ఫెడీమని జవాబిచ్చేయడం, స్కూల్లో కూడా తనకి నచ్చనివారితో మాట్లాడేది కాదు. క్లాసంతటికీ ఎవరో ఒక అమ్మాయితో స్నేహంగా కాస్త స్నేహంగా వుండేది. నోట్సులు ఇచ్చిపుచ్చుకోవడం, ఎవరి మీద ఆధారపడటం ఇష్టం ఉండేది కాదు….. ‘అమ్మ, తల్లి రాక్షసి….ఎవడొస్తాడో కానీ దీనితో వేగలేక చస్తాడు’ అనేది తల్లి. జయంతి మరీ విసిగించినపుడు తక్కిన వాళ్ళు సర్దుకోవాలి తప్ప తను సర్దుకునే మనస్తత్వం లేని జయంతి ఆ యింట్లో వంటరి! వీలయినంత వరకు వంటరిగా గదిలో చదువప్పుడు చదువు. లేకపోతే ఏ పుస్తకమో చదవడం….తనేదో మిగతా వారి కంటే ప్రత్యేకం అన్నట్లుండేది. పెద్దయ్యాక ఆమెతో పాటు ఆమె అభిప్రాయాలు ఇంకా బలపడ్డాయి. ఉన్న పిల్లల్లో కాస్త బాగుండటం, చదువు బాగా చదవడం పుస్తకాలు చదువుతూ అన్ని విషయాలలో జ్ఞానం అలవరచుకోడంతో తనేదో మిగతా వారికంటే గొప్పది అన్న భావం తనకు తానే ఏర్పరచుకుంది. అమ్మలక్కల కబుర్లన్నా, స్నేహితుల షికార్లు, సినిమాలన్నా కలిసేది కాదు. చిన్నప్పటినుంచి ఊహాలోకంలోనే విహరిస్తూ తన పెద్ద ఉద్యోగం చేస్తూ మంచి ఇల్లు, కార్లు… మొగుడు పెద్ద ఆఫీసరు బంగళా తనని మురిపెంగా చూసుకోడం… ఇంట్లో తన మాటే నెగ్గుతూ భర్త అడుగులకి మడుగులు వత్తుతూ అలరిస్తాడని, ఆమె కలల్లో రాకుమారుడు అందగాడు, సరసుడు అయి కనపడేవాడు. కానీ తీరా పెళ్ళీడుకొచ్చి వాస్తవంలొ తన ఊహలకి ఎక్కడా పొంతన కుదరని పెళ్ళికొడుకులు వచ్చేసరికి నిరాశ, నిస్పృహలు తట్టుకోలేకపోయేది. తనదీ బ్యాంక్ ఉద్యోగం…. కార్లు, బంగళా ఉండే ఉద్యోగం కాదు…. కనీసం మొగుడయినా మంచివాడు దొరక్కపోతే ఎలా అని ఆలోచించేది. తల్లీ తండ్రి ఎన్నివిధాల చెప్పినా సర్దుకునేది కాదు, మొండిగా వాదించేది. అలాంటి వాడు దొరక్కపోతే పెళ్ళేచేసుకోను అనేది- సంబంధాలు చూసి చూసి తల్లి తండ్రి విసిగిపోయారు. తననుకున్నవి జరగనందుకు జయంతిలో అసహనం పెరిగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *