వెన్నెల రాత్రి 6

By | November 29, 2019
telugu stories kathalu novels books వెన్నెల రాత్రి 6 "అయ్యెయ్యో- నిన్ను ఒంటరిగా వదిలిపెట్టే..... నా ప్రాణం, పరువు అంతా- మాయలఫకీరు ప్రాణం చిలకలో వున్నట్లు నీలో ఉంది. అవతల అర్జెంట్ పనేం లేదులే" పేపర్ ను చదవడానికి ఎతుక్కుంటూ అన్నాడు. శశికి తెలుసు అతను అబద్ధం చెబుతున్నాడని. తనను అలా ఒంటరిగా వదిలిపెట్టడు. ఏమైనా ప్రమాదం జరిగితే ఎలా? తోడుగా మనిషి వుండే దారి, కథ వేరు. సాయం కోసం ఎవరినైనా అరుస్తారు అంటూ తన పట్ల జాగ్రత్తలు తీసుకుంటాడు భర్త. స్టౌను వెలిగించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓ మ్యాగజైన్ లో వస్తే ఆ పేపర్ ను కట్ చేసి స్టౌపైన గోడకి అతికించాడు. అందుకే అవతల అర్జెంట్ పనివున్నా గంగారత్నం కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడని తెలుసు శశిరేఖకి. మరో అయిదునిమిషాలకల్లా గంగారత్నం వచ్చింది. "జాగ్రత్త- రాత్రి భోజనానికి వస్తా" అని ఇద్దరితో చెప్పి బయల్దేరాడు నరేంద్ర. అతను ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కెళ్ళేటప్పటికి శివరామారావు రెడీగా కాచుక్కూర్చుని వున్నాడు. ఆయన ముఖం చూడగానే పని సక్సెస్ అయినట్లు అనిపించింది. అయినా ఆయన నోటంట ఆ మాట వినాలని నరేంద్ర ఉబలాటపడిపోయాడు. "మొత్తానికి సాధించామయ్యా" శివరామారావు కాఫీ ఓ సిప్ చేసి నింపాదిగా చెప్పాడు. చెవుల్లో అమృతం పోసినా అంత మధురంగా అన్పించదని తెలిసింది నరేంద్రకి. ఉత్సాహం, ఆనందం గుండెలోంచి పైకి చిమ్ముకొస్తున్నట్టు ఫీలయ్యాడు. ఉద్వేగమంతా కన్నీళ్ళ కింద మారిపోయినట్టు కళ్ళు చెమ్మగిల్లాయి. తమాషానా! సాధించింది చిన్న విజయమేమీ కాదు. ఎనిమిదికోట్ల రూపాయల ప్రాజెక్టు. ఎల్ అండ్ టి వాళ్ళ కాంట్రాక్ట్. అస్సాం రాజధాని గౌహతిలో ప్రాజెక్ట్ పని. శివరామారావు కొడుకు ఇంజనీర్ పాసయ్యాడు. ఉద్యోగంలో సంపాదించేది ఏమీ ఉండదని, అదీకాక థ్రిల్ మిస్సవుతావనీ, కాంట్రాక్టుల్లో స్థిరపడమని ఆయనే కొడుక్కి నచ్చచెప్పి కాంట్రాక్ట్ లలో దించాడు. మొదటి వెంచరే ప్రిస్టీజియస్ గా వుంచాలని ఆయన ఎల్ అండ్ టీ కాంట్రాక్ట్ కోసం పోటీపడ్డాడు. పోటీకి దిగేముందే ఆయన నరేంద్రను కన్ సల్ట్ అయ్యాడు. "మా వాడికి థీరిటికల్ నాలెడ్జ్ ఉందిగానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. అందుకే నువ్వూ, అతనూ కలిసి సరసమానమైన భాగస్తులుగా పని తీసుకోండి. నా వయసురీత్యా, ఆరోగ్యంరీత్యా నేనక్కడ వుండలేను. మొత్తం ప్రాజెక్ట్ ఆరునెలలే. ఫాస్ట్ గా చేసుకుని వచ్చేయండి' అని ఆయన తన మనసులో మాట చెప్పాడు. దీనికి సంతోషంగా ఒప్పుకున్నాడు నరేంద్ర. ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రాజెక్ట్ సాధించుకొచ్చారు. సాయంకాలం వరకు అన్ని విషయాలూ మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఊరెళ్ళిపోగా, నరేంద్ర ఇంటికి బయల్దేరాడు. వచ్చేవారమే అస్సాం వెళ్ళాలి. మరో ఆరునెలలపాటు ఇటు తిరిగి రావడానికి కుదరదు. ఈలోగా చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తున్నాడు. అతన్ని పీడిస్తోంది. భార్యను వదిలి ఆరునెలలు వుండడమన్నదే. కానీ వెళ్ళాలి. ఇప్పటివరకు వున్న మెట్టు నుంచి ఒక్కసారిగా పైకెగిరి అందరికంటే ఎత్తయిన మెట్టుమీద కూర్చోవాలి. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తేనే తను జిల్లాలోనే నెంబర్ వన్ కాంట్రాక్టర్ గా పేరు పడచ్చు. దాంతో కాంట్రాక్టులన్నీ కోట్లలోనే వుంటాయి. అందరూ తన గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇక ఆపై తనకు తిరుగుండదు. తనకు కావాల్సింది అదే. అందరూ తనను చూసి ఈర్షపడాలి. అతను వెళ్ళడానికి తెగ ఉత్సాహపడిపోతున్నాడుగానీ శశిరేఖ గుర్తొచ్చేటప్పటికి నీరుగారిపోతున్నాడు. తనను వదిలి వుండలేకపోతున్నాడు. తనులేని ఈ ఆరునెలల్లో తనను కంటికిరెప్పలా ఎవరు చూసుకుంటారు? అలా ఆలోచిస్తున్న అతనికి ఠక్కున గంగారత్నం గుర్తొచ్చింది. అంతవరకూ బరువుగా ఉన్న గుండె ఒక్కసారిగా రిలీఫ్ ఇచ్చినట్టు ఫీలయ్యాడు. బ్రిడ్జిపనులు చూసి త్వరగా ఇంటికి వెళ్ళి గంగారత్నంతో మాట్లాడాలి. "రేయ్- స్పీడ్ గా పోనివ్వరా" డ్రైవర్ తో విసుక్కుంటున్నట్టు అన్నాడు. జీప్ స్పీడందుకుంది. బ్రిడ్జి దగ్గరికివెళ్ళి ఇంటికి చేరుకునేటప్పటికి రాత్రి తొమ్మిదైంది. భోజనాలు ముగించారు. మామూలుగా గంగారత్నం అంత తొందరగా నిద్రపోదు. టీ.వీ.లో వచ్చే సినిమా చూసి, ఆ తరువాత నిద్రపోతుంది. అదే మంచి సమయం అనుకున్నాడు నరేంద్ర. టీ.వీ. పెట్టాడు గంగారత్నం సినిమా చూస్తోంది. భార్యతోపాటు వెళ్ళి బెడ్ రూమ్ లో పడుకున్నాడు. మరో పావుగంటకు శశిరేఖ నిద్రపోయింది. ఇక అప్పుడు బయటకొచ్చాడు నరేంద్ర. "ఏంటి బాబూ! నిద్రపోలేదా?" గంగారత్నం అడిగింది. "నీతో మాట్లాడాలి. వరండాలోకి రా" అని హాల్లోని ఓ కుర్చీ తీసుకుని వరండాలో వేసుకున్నాడు. గంగారత్నం పిల్లర్ కి వీపు ఆనించి కూర్చుంది. శశిరేఖకి మెలకువ వచ్చినా బయటికి రాకుండా తలుపువేశాడు. "ఏమిటి బాబూ?"

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *