మనసున మనసై 16

By | November 29, 2019
telugu stories kathalu novels books మనసున మనసై 16  ఇల్లే ఖాళీ అయినట్టుకాక తన మనసే శూన్యంగా అనిపించింది. "వెడతానమ్మా!" అంది దమయంతి. 'అతనొచ్చి తీసుకెళతాడుగా మళ్ళీ ఆటో దండగ ఎందుకే?" అంది పద్మావతి. వాసంతి వెళ్తుందని ఉదయమే వచ్చింది దమయంతి. "జయంతి ఎలాగూ ఆటోలో వెళ్తుందిగా తోవలో దిగిపోతాలే" ఏం జయంతీ నీతో రానా?" అంది దమయంతి. తల ఊపింది జయంతి. తల్లి మళ్ళీ ఏమైనా అంటుందేమో ఇంటికొచ్చేయ్ అని అనిపించింది. కానీ పద్మావతి ఏమీ అనకపోవడంతో ఉక్రోషం వచ్చింది. అక్కచెల్లెల్లిద్దరూ గేటు దగ్గరికి వచ్చేసరికి గోపాలకృష్ణ స్కూటర్ మీద వచ్చాడు. "వచ్చారా? ఇప్పుడే ఆటోలో వద్దామనుకుంటున్నాను" అంది దమయంతి. "ఎందుకు వస్తానన్నాగా? దేవిగారి సేవలో ఈ సేవకుడెప్పుడూ ఉంటాడుగా?" అన్నాడు గోపాలకృష్ణ నవ్వుతూ. 'పెద్ద వేషం ఎంత అన్యోన్యంగా ఉన్నామో అని చూపించడం కోసం ఈ నటన' జయంతి మూతి తిప్పుకుంది. "ఓ ఆటో చూడండి. జయంతి వెళ్తుంది." దమయంతి పురమాయించింది. "అక్కర్లేదులే ఎక్కడ దొరికితే అక్కడ ఎక్కేస్తా" జయంతి ఏదో అనేలోపలే. "అమ్మో! ఒదినగారిని నడవనిస్తానా" అంటూ స్కూటరెక్కి తుర్రుమన్నాడు. రెండు నిమిషాలలో ఆటో తెచ్చాడు. జయంతి ఆటో ఎక్కగానే అయితే వస్తా జయంతి" అంటూ దమయంతి స్కూటర్ ఎక్కింది. స్కూటర్ మీద దమయంతి గోపాలకృష్ణ నడుం పట్టుకుని ఇంచుమించు అతని మీద వాలిపోయి మొహం ముందుకు పెట్టి కబుర్లు చెపుతోంది, జయంతి తలతిప్పుకుని 'పోనీయ్' అంది.                           * * * మనీషా తన మరో బుటిక్ సోమాజీగూడ పోష్ లోకాలిటీలో తెరిచింది. ఆ రోజు ప్ర్రారంభోత్సవానికి ఓ సినిమానటిని పిలిచి హడావుడి చేసింది. దివాకర్ ఏర్పాట్లన్నింటిలో మనీషాకి కుడిభుజంలా నిలిచి చెప్పినవి చెప్పనివి అన్నీ తనే అయి చేశాడు. మనీషా బంధువులు, స్నేహితులు అంతాకలిసి ఓ యాభై అరవైమంది బిజినెస్ కమ్యూనిటీ వారు వచ్చారు ఓపెనింగుకి. సినిమానటిని చూడటానికి జనం షాపు ముందు గుమిగూడారు. మొదటి బోణీగా ఆ సినిమానటి ఓ డ్రెస్ కొన్న తర్వాత మనీషా తన తరపునుంచి మరో డ్రెస్సు బహుమతి ఇచ్చింది. మనీషా ముందు మాట్లాడుతూ ఈ బుటిక్ ప్రారంభించడానికి ప్రోత్సాహమే కాక ఆర్ధిక సాయం చేసిన దివాకర్ కి కృతజ్ఞతలు తెలియచేసింది. దివాకర్ ఆమాత్రం దానికే పొంగిపోయాడు. మనీషా పంపిన ఖరీదయిన బుటిక్ ఓపెనింగ్ ఆహ్వానం దివాకర్ టేబిల్ మీద చూసి తనని కూడా పిలుస్తుందేమోనని ఆశించింది జయంతి. కనీసం దివాకర్ అన్నా వెడదాం రమ్మంటాడన్న ఆశ పెట్టుకుంది. అతను మాట వరసకైనా ఆ ప్రసక్తి ఎత్తకపోవడంతో ఆమె ఉక్రోషం, అతని పట్ల తిరస్కారభావం మరింత పెరిగింది. ఇంక చచ్చినా అతని గురించి ఆలోచించరాదని, అతనిమీద ఏ విధమైన ఆశలు పెట్టుకోరాదని గట్టిగా నిర్ణయించుకుంది. ఆఫీసులో ఉన్నంతవరకు అతను బాస్... మరీ అవసరమైన అతను పిలిస్తే తప్ప అతనితో మాట్లాడవద్దనుకుంది. జయంతి మానసిక స్థితి ఏమిటో కూడా దివాకర్ గుర్తించే స్థితిలో లేడు. అతనికిపుడు జయంతి కేవలం ఓ బ్యాంకు ఉద్యోగిని అంతే. జయంతిలో హఠాత్తుగా ఓ విరక్తి, వైరాగ్యంలాంటి భావన చోటు చేసుకుంది. ఏదో నిరాసక్తత అన్నింటిలోనూ కల్గింది. వంట చేసుకోవడం బద్ధకం, తినాలి కాబట్టి ఏదో తినడం, ఇది వరకులా చీరలమీద డ్రెస్సులమీద మోజు పోయింది. అలంకరణ పట్ల శ్రద్దలేదు. ఎవరైనా ఏదో అన్నా పొడిమాటలు తప్ప మాటలు పెంచడం లేదు. ఇది వరకులా ప్రతీదానికి వాగ్వివాదాలు ఎవరితో పెట్టుకోవడం లేదు. ఏ చర్చలో పాల్గొనడం లేదు, ఆఫీసుపని యాంత్రికంగా చెయ్యడం, ఇంటికొచ్చి అలా పక్కమీద నిస్తేజంగా పడుకోవడం, కొనుక్కున్న టి.వి ని కూడా చూడబుద్దికావడంలేదు. ఇదివరకు రోజుకో, తెలుగు, ఇంగ్లీషు నవలలు చదివి పడేసేది. పుస్తకం పట్టుకున్నా దృష్టి నిలవడంలేదు. పేజీలు  కదలడం లేదు. యాంత్రికంగా తయారయిన జీవితం నుంచి ఆమెకి ఏదో మార్పు కావాలనిపిస్తుంది. తనని అందరూ వంటరి చేసి వదిలేశారు. తన గురించి ఎవరికీ పట్టడం లేదు. తనేమయినా ఎవరికీ బాధలేదు అని అనుకోగానే గొంతులో దుఃఖం అడ్డుపడ్తుంది. ఏదో దిగులు, బెంగ లోలోపల ఆమెని తినేయసాగింది. మనిషి చిక్కింది. కళ్ళకింద నిద్రలేమిని సూచిస్తూ నల్ల చారలు, పీక్కుపోయిన మొహం- జాకెట్లు వదులయ్యాయి, ఆఫీసులో కొలీగ్స్, ఏం జయంతీ ఏంటలా చిక్కిపోతున్నావు- వంట్లో బాగుండటం లేదా- ఏం తినడం లేదా డైటింగ్ తనంతట చేసుకోవాలంటే బద్దకమా, ఓసారి డాక్టరు దగ్గిర చెకప్ చేయించుకో విటమన్ మాత్రలు వేసుకో పాలుతాగు' అంతా తలో సలహా ఇచ్చారు. అన్నింటికి ఓ శుష్కహాసం చేసి వూరుకునేది జయంతి. ఇంటికెళ్ళి నెల రోజులయింది. ఏ వంకన ఇంటికెళ్ళాలి. దమయంతి కి ఫోను చేస్తేనే అనుకునేది. మళ్ళీ వూరుకునేది. పాపం అక్కయ్య ఉంటే అపుడపుడు ఫోను చేసేది ఏదో వంకన ఇంటికి పిలిచేది - జీవితం ఇంత నిస్సారంగా తయారయిందేమిటి- తన తల్లి ఏ వయసులో ముచ్చట ఆ వయసులొ జరగాలి అంటే అది నిజమే కాబోలు! మొన్ననే ఇరవై తొమ్మిది నిండాయి. తల్లి అన్నట్టు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *