ఇదీ కధ 3

By | November 21, 2019

ఇదీ కధ 3 “అదుగో అమ్మాయి వచ్చేసింది” సంతోషంతో అరచినంత పనిచేసింది నాగరత్నమ్మ. కూతురిని చూడగానే రామానాధం గారి ముఖం వికసించింది.
కారు దిగి వస్తున్న సాగర్ ను, మాధవిని చూసి “ఏమిటే , నీకేమయిన మతి పోయిందా? చెప్పా పెట్టకుండా ఇంత పొద్దు పోయిందాకా  తిరిగొస్తావ్ . మీ నాన్నగారు ఎంత ఆదుర్దా పడిపోయారో తెలుసా?” నాగరత్నమ్మ కూతురి మీద విసుక్కుంది.
సాగర్ ఊపిరి బిగపట్టాడు. చాలా హడావుడి పడి వుంటారు. ఏం చెప్పాలా , ఎలా చెప్పాలా అన్న ఆలోచనలో పడ్డాడు.
మాధవి చాలా తేలిగ్గా తీసుకొని అన్నది —–
“ఏమిటమ్మా నీ గొడవ! ఇప్పుడేమయిందని?”
“మిస్టర్ సాగర్! ఎక్కడికి వెళ్ళారు?” రామనాధం గారి ప్రశ్న ముక్తసరిగా సూటిగా ఉన్నది.
“మీరు వెళ్ళిన చోటుకే వచ్చాం సార్”
“శంకర్ మఠ్ కు వచ్చారా?”
“అవును సార్! ఈవినింగ్ మీ ఇంటి కొచ్చాను. మీరప్పుడే తన్మయానందస్వామి గారి వేదాంత గోష్టి కి వెళ్ళారని మాధవి చెప్పింది.”
“తన్మయానంద స్వామి కాదు!”
`    “మీ అమ్మాయి అలాగే చెప్పింది సార్! ఒంటరిగా ఏం కూర్చుంటావు , రమ్మని నేనే మీ అమ్మాయిని బలవంతం చేశాను. ఇద్దరం కలసి వచ్చాం.”
‘అలాగా నాయనా! అయితే అయన గారి ఉపన్యాసం అయిపోయి గంటయిపోయింది కదా! ఇప్పటి దాకా మీ రెక్కడున్నట్లు?” నాగరత్నమ్మ సాగదీసి అడిగింది.
“ఏమిటమ్మ నీ క్రాస్ ఎగ్జామినేషన్! త్రోవలో కారు చెడిపోయి ఇంతవరకూ మేం అవస్థ పడ్డాం. ఇక్కడేమో మీ గోల.”
“దట్సాల్ రైట్! ముద్దాయిల సంజాయిషీ ని కోర్టు వారు అంగీకరించడమైనది. మీ ఇద్దర్ని నిర్దోషులుగా ఎంచి విడుదల చేయడమైంది.”
‘అంత ఆ తన్మయానందుల వారి దయ.”
‘అదుగో , మళ్ళీ తన్మయానందుల వారంటున్నావ్!”
“మీ అమ్మాయి అలానే చెప్పింది.”
“ఓరి నీ ఇల్లు బంగారం గానూ! మీ అమ్మాయి చెప్పింది, మీ అమ్మాయి చెప్పింది అనకపోతే అసలు ఆ స్వామి పేరు తత్వానందుల వారని చెప్పలేవూ.”
“తత్వానందుల వారెవరే?” రామనాధం గారు పెద్దగా నవ్వుతూ అన్నారు.
“ఏదో నందులవారు, పేరులో ఏముంది స్వాముల వారు చెప్పిన తత్వం ముఖ్యం గాని!” స్వాముల పేరు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించి, గుర్తు రాక నాగరత్నమ్మ అనేసింది.
“అదేనండీ! నేనూ అనేది!” సాగర్ తప్పుకోవడానికి అవకాశం దొరికినందుకు సంతోషించాడు.
“అయన పేరు- పేరూ – అబ్బ ! మీ గొడవతో నేను కూడా మర్చిపోయాను!” రామనాధం గారు బుర్ర గోక్కున్నాడు.
“పోనీలే డాడీ! స్వాముల వారు చెప్పిన వేదాంతం గుర్తుంటే చాల్లే!” మాధవి తండ్ర్తి చేయి పట్టుకుని లోపలికి వేళదామన్నట్లు అంది.
“పేరే గుర్తు లేదు ఆయనకు. ఇంకా ఆ వేదాంతం ఏమి గుర్తుంటుంది!” మూతి తిప్పింది నాగరత్నమ్మ.”
“గుడ్ నైట్ సార్! మాధవీ చీర్ యూ! సాగర్ కార్లో కూర్చున్నాడు.
సాగర్ ఇంటికి రాగానే అర్దర్లీ విక్టర్ పరుగెత్తుకొచ్చి కారు డోర్ తెరిచాడు.
“సార్! అయ్యగారు ట్రంకాల్ చేశారు” అన్నాడు.
“ఏం చెప్పారు?”
“మీ రెక్కడికి వెళ్ళారని అడిగారు.”
“ఏం చెప్పావ్?”
“జడ్జి గారమ్మయితో యింతకు ముందే బయటకు వెళ్ళారని చెప్పాను.”
“ఇడియట్!”
“అమ్మగారితో చెప్పోద్దాన్నారు కాని అయ్యగారితో చెప్పొద్దనలేదుగా , సార్ మీరు!”
“సంతోషించాంలే! ఇంతకీ ఎందుకు చేశారు ఫోన్!”
“రేపు ఉదయం రావటం లేదు. సాయంకాలానికి వస్తారట. సాయంకాలం పార్టీకి ఏర్పాట్లన్నీ మిమ్మల్నే చూసుకోమన్నారు” గుక్క తిప్పుకోకుండా చెప్పాడు విక్టర్!
సాగర్ విక్టర్ ను కారు గెరేజ్ లో పెట్టమని చెప్పి తను ఇంట్లోకి వెళ్ళాడు. పిల్లిలా అడుగులు వేసుకుంటూ తల్లి పడుకొన్న గది తలుపులు వోరగా తోసి చూశాడు.
సుభద్రమ్మ మంచం మధ్యలో కూర్చుని అయాసపడుతుంది.
తల్లి ప్రశాంతంగా పడుకొని వుంటుందని ఆశించిన సాగర్, ఆమె పరిస్థితి చూసి తప్పు చేసినవాడిలా బాధపడ్డాడు.
“నిద్ర పోలేదా అమ్మా”
“నిద్రా పాడా! నా పని అయిపోయిందిరా అబ్బాయ్! నేనింక ఏంతో కాలం బతకను రా’ అన్నది సుభద్రమ్మ.
“అదేం మాటలమ్మా! టాబ్ లేట్ వేసుకోన్నావా?” అని అడిగాడు సాగర్.
“ఒకటి కాదు….. రెండు ! బాధ ఓర్చుకోలేక ఒకటి ఎక్కువ కూడా వేసుకున్నాను. అందువల్లనే ఈ మాత్రం కూర్చో గలుగుతున్నాను.”
“అయితే నన్ను పిలవక పోయావా అమ్మా”
“ఇంతకీ ఆ పిల్ల ఏమంటుందిరా?”
“ఏ పిల్లమ్మా’ అన్నాడు సాగర్!
“జడ్జి గారికి ఇష్టమేనా?”
“ఏమిటమ్మా నీ వనేది? నాకేం అర్ధం కావడం లేదు.”
“అన్ని గంటలు ఈ ప్రపంచాన్నే మరచిపోయి – మాట్లాడుకున్నారు కదా? పెళ్ళి సంగతి మాట్లాడుకోలేదా?”
సాగర్ నీళ్ళు నమిలినట్లు చూశాడు. “నువ్వు చూశావా అమ్మా?”
“నేను చూడటమేమిటిరా? మీరే చూడలేదు. రెండు సార్లు మీ గది ముందుకు వచ్చాను. అయినా జడ్జిగారి అమ్మాయి ఇంత రాత్రప్పుడు ఒంటరిగా రావటం ఏమిటిరా? జడ్జి గారికి అభ్యంతరం లేదేమో గాని మీ నాన్నకి తెలిస్తే ఊరుకోరు  తెలుసా? మీ ఇద్దరికీ ఇష్టమయితే జడ్జిగారి నొచ్చి మీ నాన్నగారిని అడగమను. నా ప్రాణం ‘హారి’ అనకముందే మీ పెళ్ళయినా చూస్తాను.”
“అది కాదమ్మా! ఆ అమ్మాయికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ విషయం నాతొ చెపుతూ కూర్చుంది.”

“ఏం …..వాళ్ళ నాన్నగారు ఒప్పుకోవడం లేదా?”
“అది కాదమ్మా! ఆ అమ్మాయి కేవో భయంకరమైన చిత్రాలు కన్పిస్తున్నాయంట! ఉండి ఉండి తనకేదో మాదిరిగా అయిపోతుందట. మా కాలేజి ఫంక్షన్ లో అయితే అసలు స్పృహ తప్పి పడిపోయింది.”
“అదేం పాపిష్టి జబ్బురా ఆ అమ్మాయికి! మరైతే ఆ పిల్లను చుట్టుకు చుట్టుకు తిరుగుతావ్ ఎందుకూ?’ సుభద్రమ్మ ఆయాసం ఎక్కువయింది.
“అదేం జబ్బు కాదమ్మా, అదొక మానసిక స్థితి – దానికి కారణం ఏదో వుండి వుంటుంది. ఆ కారణమేదో తెలిస్తే ఆమె మానసిక స్థితి బాగు చేయవచ్చు.”
“శరీరానికి వచ్చిన జబ్బులే నయం చేయలేరీ డాక్టర్లు! ఇక మానసిక రోగులకు నయం చేస్తారా వీళ్ళు? చూశావుగా ఐదేళ్ళ నుంచి తీసుకుంటున్నా! మందుల మీద బతకడమే కదరా! రోగం రాను రాను ఎక్కువవుతోంది కాని, తగ్గిందెక్కడరా?”
“సరేలేమ్మా! ఎక్కువగా మాట్లాడకు ఆయాసం ఎక్కువవుతుంది. మంచినీళ్ళవ్వమంటావా?”
“నీళ్ళతో పాటు రెండు నిద్రమాత్రలు కూడా ఇవ్వు. ఈరోజు అవి వేసుకోకపోతే కన్ను మూసే పనే లేదు.
“రెండు ఎందుకమ్మా! ఒకటి వేసుకో”
“ఒక్కటి వేసుకున్నా ఒకటే లేకపోయినా ఒకటే! రెండియ్యి.”
సాగర్ రెండు మాత్రలిచ్చి నీళ్ళందించాడు. మాత్రలు మింగి నీళ్ళు తాగి జీరగిలబడిన సుభద్రమ్మ , గది లోంచి బయటకు వెడుతున్న కొడుకును చూసి ——-
“ఒరే సాగరూ! ఆ పిచ్చి పిల్లతో ఎందుకురా! మీ నాన్నగారితో చెప్తాను. మంచి సంబంధం ఒకటి చూడమని. నీకేం రా “కో” అంటే కోటిమంది వస్తారు” అన్నది.
“పిచ్చి పిల్లెవరమ్మా?”
“నీదొక పిచ్చిరా? ఇప్పుడే కదా చెప్పావు , ఆ జడ్జి గారమ్మాయికి పిచ్చనీ?”
“పిచ్చి కాదమ్మా అదొక మానసిక స్థితి అంతే”
“అదేలేరా , దాన్నే పిచ్చంటారు.”
సాగర్ వెన్ను ముక లోకి చలి పాకినట్లయింది. తన తల్లి ఎంత తేలికగా మాట్లాడుతోంది? ఒక నిండు జీవితం ఎంత నిర్ధాక్షిణ్యంగా తోసి వేయబడుతోంది?
సాగర్ ఆలోచిస్తూ తల్లి కేసి మౌనంగా చూడసాగాడు. దుప్పటి పైకి లాక్కుని తల దిండు సర్దుకుంటూ “ఏమిట్రా అలా వున్నావు” అన్నది.
“ఏం లేదమ్మా బాగానే ఉన్నాను.”
“ఏం బాగో ఏమో? నేను చూస్తే ఇలా ఉన్నా. మీ నాన్న తన గొడవేదో తప్ప నీ సంగతి పట్టించుకోరాయే! నువ్వు చూస్తే ఇలా అయిపోతున్నావ్?”
“నువ్వు కళ్ళు మూసుకొని పడుకోమ్మా!”
“కళ్ళెం ఖర్మరా? నోరు ,మూసుకొనే పడుకొంటారా!”
“అబ్బ! అంతలోనే ఇదై పోతావెం అమ్మా? ఇప్పడు నేనేమన్నానని?”
“నేను మాత్రం నిన్నే మన్నానురా? పిచ్చి పిల్లతో నీకెందుకురా అన్నా. ఈ మాట తప్పటరా?”
‘అమ్మా, నువ్వు నోరుమూసుకు పడుకో” దాదాపు అరిచినట్టే అన్నాడు సాగర్.
“నేను ఇప్పుడు చేస్తున్నది అదే కదరా? నేనెంత లోకువయి పోయాను రా?” అంటూ మళ్ళీ లేచి కూర్చోడానికి ప్రయత్నం చేసింది సుభద్రమ్మ.
సాగర్ చిరాగ్గా గదిలోంచి బయటకోచ్చాడు. తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసి మంచం మీద అడ్డంగా పడుకున్నాడు. తల్లిని గురించి ఆలోచించసాగాడు. రానురాను ఆమె ఆరోగ్యం క్షిణిస్తూ వుంది. దాంతో పాటు ఆమె ప్రతిదీ అపార్ధం చేసుకోవడం, తనను అందరూ లోకువగా చూస్తున్నట్లుగా బాధపడటం ఎక్కువవుతున్నది. ఏ విషయాన్నయినా సాగదీసిగాని వదలటం లేదు. గతంలో తూచి తూచి మాట్లాడే అమ్మ ఇలా అయిపొయింది. శారీరక అనారోగ్యం మానసిక అనారోగ్యానికి దారి తీస్తున్నది….. నాన్న చూడబోతే తన డ్యూటీ కి సంబంధించిన టూర్లతో మునిగిపోయి వుంటారు. రామనాధంగారు అయన సతీమణి ఎంతో అదృష్ట వంతులు. ఎప్పుడూ జోక్స్ వేసుకుంటూ సర్దాగా కాలాన్ని గడుపుతుంటారు. ఏ సమస్యలూ లేని వాళ్ళకు కూతురు మానసిక స్థితి పూర్తిగా అర్ధమయితే బెంబేలు పడిపోతారు. ఒక్కగానొక్క బిడ్డ! కాలేజి ఫంక్షన్ లో మాధవి పడిపోవటం అంత సీరియస్ గా తీసుకున్నట్లు లేదు. డాక్టర్ ఏదో ఓవర్ ఎక్సైట్ మెంట్ వల్ల అలా జరిగిందన్నాడు. రామనాధం గారు పూర్తిగా డాక్టర్ మాట నమ్మారు.
సాగర్ పుస్తకాల మధ్య నుంచి తిరిగి ఒక నోట్ బుక్ తీశాడు . ఇంకా నయం మాధవి దాన్ని చూడలేదు. మాధవి చెప్పిన వన్నింటిని వివరంగా నోట్ చేసుకున్నాడు. టైం చూసుకున్నాడు. అర్ధరాత్రి దాటింది. భారంగా ఒళ్ళు విరుచుకున్నాడు. కొన్ని వందల మైళ్ళు పరుగెత్తినంత బడలికగా వుంది. తెల్లవారి బర్త్ డే పార్టీకి చేయవలసిన ఏర్పాట్లను గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు.

  5

సాంబశివరావు గారి బంగళా గేటు మీద రంగు రంగుల విద్యుద్దీపాలతో ‘స్వాగతం’ బోర్డు వెలిగిపోతోంది. ఆవరణలో వున్న చెట్లకు దీపాల తోరణాలు అందాన్ని చేకూరుస్తున్నాయి. అతిధులతో అక్కడ కోలాహలంగా వుంది. సాగర్ అతిధులందరిని చిరునవ్వుతో పలకరిస్తూ అన్ని టేబిల్స్ మీద సప్లయి లు అందుతున్నాయో లేదో చూసుకుంటూ ఆవరణంతా కలయ తిరుగు తున్నాడు.
“హయ్ ప్రేమ్”
“హాయ్ సుజాతా! వాట్ ఏ చేంజ్?”
“ఏం ఈ డ్రస్సు బాగా లేదా?” పైనుంచి కింద దాకా తనను తానూ చూసుకొంటూ సుజాత అడిగింది.
“నో, నో, ఇటీజ్ వండర్ ఫుల్!” సాగర్ సుజాతను నిండుగా చూస్తూ అన్నాడు.
“దట్సాల్ రైట్. మరెందుకలా అన్నావ్?”
“ఎప్పుడూ జీన్స్ లో అబ్బాయిలా వుండే నువ్వు చీరలో అమ్మాయి వయిపోయావే అని ఆశ్చర్య పడ్డాను. అంటే! చీరలో నువ్వు అప్సరసలా వున్నావ్!”
“గాస్’ మూతి విరిచింది సుజాత.
“డోంట్ బి హాట్ మై డియర్!” తన చిరాకును దాచుకోవడానికి ప్రయత్నం చేశాడు సాగర్.
“ప్రామిస్” సాగర్ చేతికి చెయ్యి ఆనించి కళ్ళల్లోకి చూసింది సుజాత.
సుజాత చేతిలో చేయి వేసిన సాగర్ తన చేతిని వెనక్కు తీసుకోలేక ఎదురుగా నిలబడ్డ మాధవిని చూస్తూ వుండి పోయాడు. మాధవి గిర్రున వెనక్కు తిరిగింది!
“నాన్నగారు రాలేదా?”
“వచ్చారు. అదే మీ నాన్నగారి దగ్గరే నిలబడి వున్నారు , చూడలేదా!” ……సుజాత సాగర్ కు ఇంకా దగ్గరగా జరిగి అన్నది.

జడ్జి గారొచ్చారా?”
“ఏమిటి డాక్టరు గార్ని జడ్జి చేసేస్తున్నావ్?”
“ఆహా! మీ నాన్నగారు కాదు! మాధవి నాన్నగారిని గురించి అడుగుతున్నాను.”
“యూ సిల్లి బాయ్ . వాళ్ళ నాన్నను గురించి నన్ను అడుగుతా వెందుకు?”
“నో! నో!” నిన్ను కాదు మాధవినే అడుగుతున్నాను”
సుజాత గిర్రున వెనక్కు తిరిగి తన చేతిలో వున్నసాగర్ చేతిని విసురుగా వదిలేసి “ఊ వెళ్ళు , కొంగు పట్టుకు తిరుగు” అన్నది.
“ఏం! నీ చీరకు కొంగు లేదా?”
“కొంగు చూపించి వెళ్తున్నది అవిడేగా!’ సాగదీస్తూ అన్నది సుజాత.
అంతలో “హల్లో! సాగర్’ అంటూ నలుగురు కుర్రాళ్ళు సాగర్ దగ్గరకు వచ్చారు.
వాళ్ళను తీసుకువెళ్ళి వేరే టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తనూ వాళ్ళతో బాటు కూర్చున్నాడు. స్నేహితులు కేక్స్ స్వీట్స్ తింటూ కబుర్లు చెబుతూ కూర్చున్నారు.
ఓ అరగంట గడిచింది. బేరర్ ఐస్ క్రీమ్స్ సర్వ్ చేసాడు.
అల్లంత దూరంలో సన్నజాజి పందిరి పక్కగా నున్న టేబుల్ చుట్టూ గుమికూడారు. దగ్గరలో వున్నా వాళ్ళు లేచి సన్నజాజి పందిరి కేసి పరిగెత్తారు.
సాగర్ తను కూర్చున్న కుర్చీని వెనక్కు తోసి గుమికూడిన జనాన్ని తప్పుకొని టేబిల్ ముందుకు వచ్చాడు.
‘అయ్యో మాధవి!” మాధవి తలను ఒడిలో పెట్టుకుని ఏడుస్తుంది నాగరత్నమ్మ.
డాక్టర్ మూర్తి వంగి మాధవి నాడి చూస్తూ వున్నాడు. అంతలో సాంబశివరావుతో కలిసి జడ్జి రామనాధం వచ్చారు. వాళ్ళ వెనుకే సుజాత పరుగెత్తు కొచ్చింది.
“గాభరా పడాల్సిందేమీ లేదు! షి ఈజ్ అల్ రైట్, లే అమ్మాయ్! కూర్చో! ఏం జరిగింది?” డాక్టర్ మూర్తి మాధవిని లేవదీసి కూర్చో బెట్టాడు.
మాధవి దృష్టి సాగర్ మీద పడింది. చివాలున లేచి సాగర్ ను చిన్నపిల్లలా పెనవేసుకుంది.
సాగర్ మాధవి వీపు తడుతూ “ఒకే నౌ రిలాక్స్” అనునయించాడు.
“వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసేయండి! మీ అమ్మాయి జబ్బు నయమవుతుంది” జడ్జిగారిని , సాంబశివరావు గారిని చూస్తూ అన్నాడు డాక్టర్.
ఆ మాట తూటాలా వచ్చి సాగర్ బుర్రలోకి ప్రవేశించింది. తామే పరిస్థితిలో వున్నది గ్రహించిన సాగర్ బిడియ పడ్డాడు. మాధవి చేతులను మెల్లగా తప్పించి దూరంగా జరిగాడు. మాధవి కళ్ళల్లో అనూహ్యమైన భయాలు దోబూచు లాడుతున్నట్లున్నాయి.
మాధవిని కార్లో కూర్చోబెట్టి , తల్లీ, తండ్రి చెరో ప్రక్క కూర్చున్నారు. డాక్టర్ మూర్తి రామనాధం గారికి చీటీ అందిస్తూ “రాత్రికి రెండు టాబ్ లెట్స్ వేయండి. రేపు మూడు పూటలా ఒక్కొక్కటి వేయండి. ఎల్లుండి ఎలా వున్నది చెప్పండి” అన్నాడు.
చీటీ అందుకొన్న రామనాధం డాక్టర్ కేసి కృతజ్ఞత భావంతో చూశాడు.
“చాలా థాంక్స్ డాక్టర్ గారూ! అమ్మాయిని ఎవరైనా స్పెషలిస్టు కి చూపిస్తే మంచిదనుకుంటాను” సూచనగా అన్నాడు రామనాధం.
‘అవసరమైతే అలాగే చేద్దాం . షి విల్ బి. అల్ రైట్ బై టుమారో….. రేపు నాకోకసారి ఫోన్ చేయండి. అమ్మాయిని పూర్తిగా రెస్ట్ తీసుకోమనండి. గుడ్ నైట్ పాపా! మాధవీ! చీర్ యూ!” అన్నాడు డాక్టర్.
మాధవి పేలవంగా నవ్వి “థాంక్యు సర్” అని ‘గుడ్ నైట్” చెప్పింది.
కారు సాగిపోతుంటే మాధవి కళ్ళు సాగర్ ను వెతికాయి. నిలబడి వున్న సాగర్ చేయి ఊపాడు. డాక్టర్ ను సాగనంపుతూ తండ్రి సాంబశివరావు డాక్టర్ మూర్తితో కలిసి రావడం సాగర్ చూశాడు.
“మీ వాడు జడ్జి గారమ్మయితో….”
డాక్టరు మాట పూర్తీ కాక ముందే సాంబశివరావు అందుకొని “జడ్జి గారు మా ఫామిలీ ఫ్రెండ్! పిల్లలిద్దరూ చాలా కాలంగా కలసి మెలసి తిరిగిన వాళ్ళు!” అన్నాడు.
‘అయితే ఇంకేం బంధుత్వం కలుపుకో!”
“కాని అమ్మాయి…..”
“పెళ్ళయితే పిచ్చి కుదురుతుందంటారుగా!”
“కుదురుతుందో ముదురుతుందో!”
మొత్తానికీ పోలీసువాడి వనిపిం’చేవయ్యా. ఆ సంగతి చెప్పాల్సింది డాక్టర్లు. పోలీసులు కాదు.!”
“అందుకే నిన్ను సామెతలు చెప్పకుండా సీరియస్ గా అలోచించి చెప్పమంటున్నాను.”
“ఫిట్స్ తప్ప వేరే ఏం లేదనుకుంటాను.”
“అది చాలదా ఏం? ఇంకా వేరే ఏం కావాలి? ఫిట్స్ ఎండుకోస్తున్నాయ్? దానికి ట్రీట్ మెంట్ ఏమిటి?”
“కేసు పూర్తిగా ఇన్విష్టిగేట్ చేయాలి. అన్ని టెస్టులు పూర్తి చేసి న్యూరాలజిస్టును కన్సల్ట్ చేయాలి. ఆ మాటే జడ్జి గారికి కూడా చెప్పాను” కారు డోర్ తెరచి పట్టుకొని అన్నాడు డాక్టరు.
వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ వెనుకే వచ్చిన సాగర్ “డాడీ ఆర్.డి. ఓ గారు మీ కోసం చూస్తున్నారు” అని చెప్పాడు.
డాక్టరుకు గుడ్ నైట్ ‘ చెప్పి సాంబశివరావు వెళ్ళి పోయాడు.
కారు స్టార్ట్ చేస్తున్నడాక్టరు దగ్గర కొచ్చి “మీతో ఓసారి మాట్లాడాలి, ఎప్పుడు రమ్మంటారు?” సాగర్ అడిగాడు.
“నీ గరల్ ఫ్రెండ్ సంగతేనా? మీ నాన్నగారితో ఇంతకూ ముందే చెప్పానోయ్” అన్నాడు డాక్టర్.
“మీతో కొన్ని ముఖ్యమయిన విషయాలు మాట్లాడాలి!”
“ఓ.కే. ఎప్పుడైనా ఈవినింగ్ రా! ఫోన్ చేసి రా!”
డాక్టరు గారి కారు గేటు దాటిపోయింది. మరో గంట కల్లా అంతా సద్దుమణిగింది. లైట్లు వాళ్ళు, హోటల్ వాళ్ళు సామాను లారీలో ఎక్కించుకు వెళ్ళిపోయారు. పోలీసు సిబ్బంది ఎస్.పి గారికి శెల్యుట్ వెళ్ళిపోయారు.
సాగర్ తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొంటుండగా తండ్రి పిలుపు వినిపించింది. మళ్ళీ చొక్కా తగిలించుకొని వచ్చాడు.
“సాగర్, సుజాతను వాళ్ళింటి దగ్గర దింపిరా. చాలా పొద్దుపోయింది.
‘అదేమిటి / సుజాత ఇంకా ఇక్కడే వుందా?”
‘అవును, ,మీ అమ్మతో మాట్లాడుతూ కూర్చున్నది. ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేయ్.” అని చెప్పి సాంబశివరావు తన గదిలోకి వెళ్ళిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *